Friday, March 25, 2011

విశ్వనాధ వారి వీర కామెడీ : "విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు" - మీరూ చదివేయండి


విశ్వనాధ సత్యనారాయణ - ఈ పేరు వింటే ఒక ఏకవీర, ఒక వేయిపడగలు, ఒక రామాయణ కల్ప వృక్షం గుర్తొస్తాయి. అబ్బే ఈయన అదో టైపు. బాష కుసింత భారీగా ఉంటుంది. ఒక ముళ్ళపూడి వెంకటరమణ, రావిశాస్త్రిల్లా అందరికీ అర్ధమయ్యేలా రాయక కాస్త గ్రాంధికం పాళ్ళు ఎక్కువేసి కన్నీళ్లు, సెంటిమెంటు వగైరా సీరియస్ రసాలే తప్ప కామెడీ రాయడు అనుకునే వారికి ఈ పుస్తకం చదివితే ఆయనలో ఇంకో కోణం కనిపిస్తుంది. ఈ పుస్తకం చదువుతుంటే నాకు బోల్డన్ని పంచ్ డైలాగులు కనిపించి వార్నీ ఈయనలో ఇంత హాస్య చతురత ఉందా అనిపించింది. ఈ ఒక్కటే కాదు హా హా హు హు అని ఈయన రాసిన ఇంకో కామెడీ నవల (దాన్ని నవల అనేకన్నా పెద్ద కధ అనడం సబబేమో) చదివాక ఆయన ఊహాశక్తికి ఆశ్చర్యమేసింది. తరవాత పోస్ట్ లో అది కూడా ఇస్తా లెండి. ప్రస్తుతానికి మాత్రం ఇది చదివి మనసారా నవ్వుకోండి. వ్యంగ్య హాస్యం ఇందులో పుష్కలంగా ఉంది. లింక్ కింద ఇస్తున్నా.

6 comments:

Gopal said...

విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు, హాహా హూహూ రెండు కూడా చదివాను. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు కొని మరీచదివాను తరువాత దాని అయిపు లేదు. కాంతా విత్తం పుస్తకం పరహస్తం గతం గతః - అంటే ఎవరో లేపేసారు.

కానీ ఈ పుస్తకాన్ని ఇలా నెట్ లో పెట్టవచ్చా. విశ్వనాధ వారి కుటుంబం కాపీ హక్కులు ఎవరికీ ఇవ్వరు. అలా ఇచ్చేమాటయితే విశ్వనాధ వారి నవలలు చిన్నపిల్లలు కూడా చదువుకునేట్టు పాకెట్ బుక్ ల క్రింద తిరగరాయించి ప్రింటు చేయిస్తే బాగుంటుంది (పాతకాలపు డికెన్స్ ఇంగ్లీషు నవలలను పాకెట్ బుక్ ల కింద వేసినట్లు)

SHANKAR.S said...

వేణు గోపాల్ గారు,
విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు ఇప్పటి మార్కెట్ లో దొరుకుతోంది కానీ హా హా హూ హూ గురించి ఎంత వెతికినా దొరకలేదు. ఇక నెట్ లో పెట్టడం గురించి అంటారా,నాకూ నెట్లోనే దొరికిన ఈ పుస్తకాన్ని విశ్వనాధ వారు సీరియస్ రచనలే కాదు ఇలాంటి హాస్య రచనలు కూడా చేశారు అని నలుగురికీ చెప్పే ఉద్దేశ్యం తోనే పోస్ట్ చేసాను. విశ్వనాధ వారి కుటుంబం అభ్యంతర పెట్టరనే అనుకుంటున్నాను. ఒకవేళ అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్పకుండా ఈ పోస్ట్ తొలగిస్తాను.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

నెనరులండి.

తృష్ణ said...

చిన్నప్పుడు తెలుగు పాఠంలో పేర్లు చదవటమేనండి...చదివే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.

బాలు said...

విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు ఆంధ్రప్రభలో సీరియల్గా వస్తుంటే చదివానండీ. అందులో విశ్వనాథ అడిగే చాలా డౌట్లకి ఎవరో(గుర్తులేదు కానీ, ప్రముఖులే) సమాధానాలు కూడా చెప్పారు. ఆ సమాధానాల కన్నా ఆయన డౌట్లకు భలే నవ్వొస్తుంది. ఆయనా తెలియక రాయలేదనుకుంటా బహుశా. ఎమెస్కోవాళ్లు ఆయన రచనల్ని పాకెట్ సిరీస్ కింద అందించారు కూడా.
ఇహపోతే, ఆయన రచనా పద్ధతి కూడా విచిత్రంగా ఉంటుంది. రోజూ ఉదయం పదింటికల్లా పత్రికలవాళ్లూ పబ్లిషర్లూ ఆయన ఇంటికి వెళ్లేవారట. అలా ఓ పదిమంది చేరాక విశ్వనాథవారు ఒక మనిషిని చూసి... ‘నీకేం కావాల్రా’ అని అడిగితే వాడు ఏదో సీరియలో నవలో పేరు చెప్పేవాడట. ముందురోజు ఆ కథ ఆపిన దగ్గర్నుంచీ ఈయన తర్వాత భాగం చెప్పేవారట. అలా పదిమందినీ కూర్చోబెట్టి ఎవరికేది కావాలో అది చెప్పి పంపించేవారట. అదీ ఆయన జ్ఞాపకశక్తి, ధారణశక్తి, రచనా పటిమ. (ఇది శ్రీరమణగారు స్వయంగా నాతో చెప్పిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆయన కూడా పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా ఉన్నప్పుడు కవిసామ్రాట్టు కథ చెప్తుంటే రాసుకున్న వారే).

మురళి said...

మొన్ననే ఈ పుస్తకం (నాటక రూపం) కొనబోయి ఆగానండీ.. నాకు 'ఏకవీర' చదవాలని ఉంది కానీ, మొత్తం రచనలు కలిపి కొనాలట! అప్పుడెప్పుడో 'వేయిపడగలు' ఒక్కటీ దొరికిన కాలంలో కొని చదివాను...

Post a Comment