(నాటిక)
(ప్రవేశం: కీచకుడు. సుమారు 30 ఏళ్ళు ఉంటాయి. ఫ్రెంచ్ కట్ మీసం, బెంగాలీ క్రాఫ్)
నా పేరు సింహబలుడు. నేను విరాటరాజు గారి పెద్ద బావమరిదిని. నేను మెత్తగా ఉన్నంత సేపూ లక్కల్లే ఉంటాగానీ - బిగించేసానంటేనా - హే( యమ నిక్కు నిక్కుతా! ఏమిటో అల్లాటప్పా కింద కట్టేస్తున్నట్లుంది లోకం...ఉల్లిపాయల పులుసు అంటే నాకు - ఎంత ఇష్టమో .....?
(ద్రౌపది ఇంతట్లో ప్రవేశించి ఆరు నెలలనాడు పోయిన 'ఉత్తర' పాత చెడావుల్ని వెతుకుతూ అక్కడే తచ్చాడుతూంటుంది. వయసు 26. కష్టాలనుభవించిన మొహం)
సింహబలుడు: (తనలో) ఈ అమ్మాయినే కదూ - కాముకి - అని అన్నాడు మా వూరి అబ్బాయి. (పైకి) తమరేనా మా అక్క అంతఃపురంలో ఇటీవల ఉన్నది.
ద్రౌపది: అవును
సింహ: నా పేరు సింహబలుడు. నేను విరాటరాజు గారి పెద్ద బావను.
ద్రౌపది: చిత్తం తమరు పండితులని విన్నాను
సింహ: నాకు పెద్ద బాల శిక్ష బాఘా వొచ్చును
ద్రౌపది: చిత్తం
సింహ : (తనలో) ఈ అమ్మాయి బాగా ఉల్లిపాయలు తింటుందల్లే ఉంది. అమ్మో ఎంత "శృంగార రస పట్టభద్ర'యో? (పైకి) మీ పేరు?
ద్రౌపది: సైరంధ్రి అంటారు
సింహ: మీరు ప్రబంధ యుగంలోంచి ఇలా చక్కా..వచ్చారా (తనలో - భలే బాగుంది)
ద్రౌపది: ఓ నాటకం కూడా దాటి వచ్చాను
సింహ: (తనలో) పాపం - ప్రబంధం అంటే ఎరగదల్లే ఉంది. (పైకి) ప్రబంధం అంటే ఎరగరా మీరు? కవి చౌడప్ప శతకం లేదూ...అట్టివి ప్రబంధాలంటే - మీకు సంగీతం బాగా వచ్చనుకుంటా?
ద్రౌపది: (తనలో) ఛీ - వీడొక త్రాష్టుడు
సింహ: ఇప్పుడు పాడమంటాననా ఆలోచిస్తున్నారు? అబ్బే ఎల్లుండి మా ఇంట్లో కచ్చేరీ పెట్టిద్దామని.
ద్రౌపది : (తనలో) వీణ్ణి ఎలాగన్నా మన్ను చేయాలి
సింహ: మిమ్మల్నీ ఇటీవల ..."అయిదుగురు భర్తలట ఎంత కాముకి?" అన్నార్ట ఎవరో?
ద్రౌపది: (మౌనం)
సింహ: సరేలెండి మా అక్కగారు ఇంట్లో ఉన్నారా?
ద్రౌపది: ఉన్నారనుకుంటా
(ఇద్దరూ వెళ్ళిపోతారు)
రెండో రంగం
(సుధేష్ణ టీ త్రాగుతూంటుంది. సాయంకాలం నాలుగు గంటల ప్రాంతం. ఉత్తర అప్పుడే వచ్చి టీకి కబురు చేసి సిగరట్టు ముట్టిస్తుంది. సింహబలుడు కొంచెం అవతల గడ్డం చేసుకుంటూ ఉంటాడు. ద్రౌపది ఉత్తరకు కూడా టీ తెచ్చి టీపాయి మీద పెట్టి పోతుంది).
సింహ: అక్కయ్యా ఈ అమ్మాయి ఎవరూ?
సుధేష్ణ: ఎవరో నాకు తెలియదు, ఓ ఏడాది మా ఇంట్లో ఉంటానంటే ఉండమన్నాను.
ఉత్తర: సంగీతం బాగా వచ్చనుకుంటా మామయ్యా! మా బృహన్నల గారు చెప్పారు.
సుధేష్ణ : అలా అనకూడదు పరాయివాళ్ళని
సింహ: అక్కయ్యా ఆ అమ్మాయిని చూస్తే రకం వారీగానే ఉన్నది
సుధేష్ణ: అప్పుడే నీ కన్నుబడ్డదీ - ఇక బాగుపడవు
సింహ: అదికాదు అక్కయా - మొన్న మన ఊళ్ళో ఎవరో అన్నారు. 5 గురు భర్తలట ఎంత కాముకి" అని
సుధేష్ణ: అంతా ఉత్తది
సింహ: అవునుగానీ - చెబితే నమ్ముతావో నమ్మవో అక్కయ్యా ఆ అమ్మాయి నా కోసం ఎదురు రొమ్ము కొట్టుకుంటుంది
సుధేష్ణ: ఛీ తప్పు - అల్లా అనకూడదు
సింహ: అల్లాక్కాదక్కయ్యా - ఆవిడ కళ్ళు చూశావూ? ఏమోకానీ అక్కయ్యా నాకు మటుక్కు ఆవిడంటే సుగంధంతో కూడుకున్న టీవలె ఉంటుంది
సుధేష్ణ: ఇటువంటి మాటలు చెప్పకు
ఉత్తర: మామయ్య రసోన్మత్తుడు
సింహ: అక్కా చనువు కనక నీతో చెబుతున్నాను ఆ అమ్మాయిని ఈ రాత్రి మా ఇంటికి పంపకపోతే ఈ కత్తి పెట్టుకుని పీక కోసుకుంటాను - నిజం
సుధేష్ణ: అఘాయిత్యం మాటలు చెప్పకు
సింహ: నిజం అక్కయ్యా నిజం ముమ్మాటికీ నిజం
సుధేష్ణ: నీకు సుధేష్ణ వంటిది. తప్పు. అలా అనకూడదు
సింహ: అక్కా నీకేమన్నా పిచ్చా వెర్రి పోలికలు తెస్తావేంటి. నా మాటలు ఒప్పుకోకపోతే ఇప్పుడు నీ కళ్ళ ఎదుటే ఇప్పుడే కోసుకుంటాను - ఇదిగో
సుధేష్ణ: ఏమిట్రా గందరగోళం
ఉత్తర: మామయ్యా సిగరెట్టు కావాలా?
(సింహబలుడు గడ్డం గీసుకోవడం పూర్తి అవుతుంది. ముఖం కడుక్కుని వస్తాడు, ఉత్తర సిగరెట్టు ఇస్తుంది. సింహబలుడు అంటిస్తాడు)
సింహ : అక్కా నా వొళ్ళు పట్టుకుచూడు...ఎట్లా ఉందో - శీతల పైత్య జ్వరం లాగు !
సుధేష్ణ : అప్రతిష్ట ....అప్రతిష్ట
సింహ: ఉత్తరా టీ తీసుకురమ్మను
(ఉత్తర వెళ్లిపోబోతుంటే - కీచకుడు ఆమెకు కన్ను కొడతాడు. ఆమె మొహం చిట్లించుకు వెళ్ళిపోతుంది)
సింహ : (టీ త్రాగుతూ) అక్కయ్యా రాత్రి పది దాటింతరువాత టీ కాచమను. టీ డస్ట్ తీసి దాచెయ్యి. ఆ వెనక టీ డస్ట్ కోసం సైరంద్రిని మా ఇంటికి పంపు ...లేకపోతే బ్రతకను
సుధేష్ణ : జలగలా పట్టుకున్నావేమిటిరా? అల్లాగేలే వెళ్ళు
సింహ: అల్లాగేలే అంటే కాదు. ఎదురు చూస్తూ ఉంటాను.
సుధేష్ణ: సరేలే
సింహ: అక్కయ్యా అన్నమాట తప్పకూడదు
సుధేష్ణ: నాకు అప్రతిష్ట తీసుకురాకు
సింహ: చెప్పిపెట్టే బుద్ధి ఎంతసేపూ (అంతా వెళ్ళిపోతారు)
(వర్షం కురుస్తుంది ఆ వర్షం అల్లా - ఇల్లా - భేషుగ్గా - సొగసుగా ఉన్నది)
మూడో రంగం
(రాత్రి పదిగంటల తరువాత)
(ద్రౌపది వెళ్ళలేక గజగమనంతో వెళ్ళుతూంటుంది. కీచకుడు ఏమీ తోచక వరండాలో అటూ ఇటూ పచార్లు చేస్తూంటాడు. వాకిట్లో పారావాళ్ళు ఉండరు. దూరం నుంచి ద్రౌపదిని చూసి ఇంట్లోకి పారిపోయి పెద్ద బాలశిక్షా, కవిచౌడప్ప శతకం తీసుకుని చదువుతూంటాడు)
ద్రౌపది : (ప్రవేశించి) సింహబల మహారాజా
సింహ: ......
ద్రౌపది: కీచక మహారాజా
సింహ: ఎవరు వారు?
ద్రౌపది: నేనండీ సైరంధ్రిని. సుధేష్ణ పంపితే వచ్చాను.
సింహ: ఓహో మీరా..దయచేయండి. లోపల చదువుకుంటున్నాను
ద్రౌపది:: తమరిప్పుడు పఠించే గ్రంధమేమిటండీ?
సింహ: పెద్ద బాలశిక్ష
ద్రౌపది: అల్లాగండీ
సింహ: మా అక్క మిమ్మల్ని పంపిందా?
ద్రౌపది: అవును టీ డస్ట్ కోసం
సింహ: 'రావే నీ కవుగిట నన్నదుమవే'
ద్రౌపది: తమరు టీ సేవించారా?
సింహ: నీకు కావలెనా? ఓ లక్ష కప్పులు ఇప్పిస్తాను
ద్రౌపది: నాకక్కర్లేదు. తమరు కులాసాగా పాడుకుంటుంటే తాగారేమో అనుకున్నాను
సింహ: పోనీ నువ్వు కూడా తాగరాదూ
ద్రౌపది: అక్కర్లేదండీ
సింహ: మీరు కూడా తాగి నన్ను ధన్యుడ్ని చేయరాదూ? ఇదిగో ప్రేమదాసుడు
ద్రౌపది: టీ డస్ట్ ఇప్పించండి - మీ అక్కగారు టీ కోసం బాధపడుతూంటారు
సింహ: (వెకిలి నవ్వు నవ్వి) మరేమీ అక్కకు బాధుండదు లెండి
ద్రౌపది: కాదు తలనొప్పిగా ఉందామెకు
సింహ: అదంతా ఒట్టిది - నాకోసమే మిమ్మల్ని పంపారు (అని ముందుకొస్తాడు)
ద్రౌపది : (వైతొలగి) దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక...
సింహ: ఆగూ. నాకూ వచ్చు ఆ పద్యం - పరవాలా "నీ చనుకొండల గ్రుమ్మి"
ద్రౌపది: (ఇరిటేటై) నలిపి వేయాలా?
సింహ: ఆ( అదీ
ద్రౌపది: ఇంతకీ టీ డస్ట్ ఇస్తారా ఇయ్యరా?
సింహ: నీ కాలిమీద పడతా. కౌగిలి ఇయ్యవూ?
ద్రౌపది: హల్లాగా
సింహ: మరి నా వొళ్ళు పనసకాయల్లే గరి పొడవద్దూ? (దగ్గరకొస్తాడు)
ద్రౌపది: ఠట్..ఆగు
సింహ : (అదిరిపడి క్రాఫ్ ఎగరేస్తాడు)
ద్రౌపది: నేను వెళ్లిపోవచ్చా
సింహ: అప్పుడే
ద్రౌపది: మరి నేను వచ్చిన పని అయిందిగా
సింహ: నాకు ప్రేమభిక్ష పెట్టవూ?
ద్రౌపది: నాకోసం నువ్వు ఏం త్యాగం చేస్తావ్?
సింహ: నా ప్రాణాలు అయిదూ అర్పిస్తా
ద్రౌపది: (ప్రక్కనున్న ఇనుప గుదియబండ అతనికి తెలియకుండా పట్టుకుని ) అయితే ఇల్లారా
సింహ: (వొస్తాడు)
ద్రౌపది: అల్లాపో
సింహ: (పోతాడు)
ద్రౌపది: ఇల్లా వచ్చి అటు మొహం పెట్టి కూర్చో
సింహ:(అల్లాగే కూర్చుంటాడు)
ద్రౌపది: (వెనుకపాటున ఠపీమని గుదియ పెట్టి వాడి నెత్తిన కొడుతుంది. సింహ బలుడికి వొళ్ళంతా నెత్తురుమయం)
(ఇవతలకు వచ్చి) ఇవాళతో అజ్ఞాతవాసం సంపూర్తి. ఇకముందు చూసే రక్తప్రవాహానికి ఇది మొదటి అనుభవం. త్రాష్టుడు. వెళ్లి ఈ వార్త భీముడితో చెప్తా.
(తెర)