Thursday, February 23, 2012

ఎవడ్రా సెప్పింది రవణ లేడని?


 ఇదిగో సెగట్రీ ఎవడయ్యా ఈ రవణ?? ఈ రోజు తన మొదటి వర్ధంతి అని జనాలు ఓ నివాళులు అర్పించేస్తున్నారు?

ఆయ్! ఆయనో గొప్ప తెలుగు సాహితీవేత్తండి

సాహితీ వేత్తా???చాలా పెద్ద పదం వాడేశావేమో?

అబ్బే లేదండి. కరెస్టుగానే చెప్పా

అవునూ రవణ అంటే ఆ బొమ్మలేసుకునే బాపుతో పాటు వినిపించే పేరేనా? ఆళ్లిద్దరూ మంచి ఫ్రెండ్సు అని విన్నా

ఆయ్ ఆయనేనండి. అయినా ఆళ్ళు ఇద్దరు కాదండి. ఒక్కరే

ఆయనేదో కామెడీ రాతలు రాస్తాడు కదయ్యా. సాహితీవేత్త అదీ..ఇదీ అని తెగపొగిడేస్తావేంటి?

ఆయ్ మన తెలుగోళ్ళతో వచ్చిన చిక్కే అదండయ్యా. ఎవరికైనా ఒక్క ఇమేజ్ ఇచ్చారంటే ఇహ దానికే కట్టి పారేస్తారు

సరే లెద్దూ..ఇంతకీ ఈయనేం చేశాట్ట సాహిత్యానికి?, తెలుగోళ్ళకి? శ్రీశ్రీ లా సమాజాన్ని తట్టి లేపాడా? విశ్వనాధలా తెలుగు సాహిత్యాన్ని జ్ఞానపీఠం ఎక్కించాడా?

ఆళ్ళు సేయలేని పని ఈయన చేశాడండి

ఏంటో?

మనందరి బాల్యాన్ని బుడుగు పేరుతో శాశ్వతం చేసి పారేశాడు. అదొక్కటి చాలు కదండయ్యా

అంటే పిల్లకాయల కతలు రాశాడా?

లేదండి బుడుగుని మనకిచ్చి మన బాల్యాన్ని ఎప్పుడూ మనతో పాటే భద్రంగా ఉంచుకునేలా చేశాడండి. బుడుగుని చూస్తే మన చిన్నప్పటి రోజుల్ని అద్దంలో చూసుకున్నట్టేనండి మరి ఆయ్(!

సరే గానీ ఇంకేవయినా రాశాడా? కామెడీ కతల గురించి సెప్పమాక అయి నేనూ ఇన్నా.

ఒక్కటని ఎలా సెప్తామండీ మధ్యతరగతి జీవితాలలో ఉప్పూ, కారం, పులుపు వగైరాల్ని నొప్పి తెలియకుండా, కష్టాల్ని కూడా కామెడీ పూతతో తెలుగోడికి రుచ్చూపించాడండి.

కామెడీతో కూడా కన్నీళ్లు పెట్టించచ్చు అని చెప్పాడంటావ్! అంతేనా?

ఆయ్! అలాక్కూడా అనుకోవచ్చండయ్యా

అద్సరే కానీ యమ సీరియస్సు మేటర్లు ఎవన్నా గీకాడా?

భలేవారే గిరీశంతో లెక్చర్లిప్పించి ఎకేస్తేనూ!

బావుందయ్యోయ్ అయితే మనోడికి సామాజిక స్పృహ కూడా ఉందన్నమాట

ఆయ్(. అన్నట్టు మర్చిపోయానండోయ్. ఈయన గారు మొత్తం కృష్ణ తత్వాన్ని ఒక్క కతలో ఇమిడ్చేశాడు

ఊర్కోవయ్యా నువ్వు మరీనూ. అతిశయోక్తి కి కూడా ఓ హద్దుండాల. కృష్ణతత్త్వం చెప్పడానికి పురాణాలే సరిపోలేదు. కతలో ఇరికిన్చేయడం ఏంటి? కామెడీ కాకపోతే, అదీ ఈయన?

ఆయ్ (..నిజవేనండి బాబూ. కానుక అని ఓ కత రాశాడు. ఈయన మిగిలిన రచనలు ఒకెత్తు. అదొహ్హటీ ఒకెత్తు.

తులాభారంలో కృష్ణుడు, తులసాకులా అన్న మాట

మరే! బాగా చెప్పారు

సూడబోతే తెలుగోళ్ళకి చాలానే సేసినట్టు ఉన్నాడయ్యోయ్

అయ్( అదే కదండీ నేను చెప్తూంటా. బుడుగునిచ్చి మన బాల్యాన్ని; అప్పారావునిచ్చి మధ్య తరగతి రుణానుబంధాల్ని; రాధని, గోపాళాన్ని ఇచ్చి మొగుడూపెళ్ళాల ముద్దుముచ్చట్లని ఇలా ఒక్కటేంటి తెలుగు జాతి మొత్తాన్ని జనతా ఎక్స్ప్రెస్ లో ఎక్కించి తిప్పాడు కదండయ్యా. అన్నట్టు మిమ్మల్ని, నన్నూ కూడా పుట్టించింది ఆయనే నండోయ్!!!

సూడబోతే మా గొప్పోడయ్యా ఈ రవణ. మరి అంత గొప్పోడు ఇలా అర్ధాంతరంగా తన ఫ్రెండుని వదిలి వెళ్లిపోవడం ఏం న్యాయమయ్యా? పాపం ఆ బాపుని తల్చుకుంటే జాలేస్తోంది

జాలెందుకండయ్యా? రవణ గారు పోయారని ఎవరు చెప్పారు మీకు?

అదేంటీ అంతా నివాళులు గట్రా అర్పించేస్తూంటేనూ.....

రవణగోరికి మరణం లేదండయ్యా. బాపులో ఉంటాడు, బుడుగులో ఉంటాడు, అప్పారావులో ఉంటాడు, మీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ప్రతి తెలుగోడి గుండెలో ఉంటాడు, ఉన్నాడు

Tuesday, September 6, 2011

"కీచక వధ" - జరుక్ మార్కు పేరడీ


జరుక్ శాస్త్రి గా సుప్రసిద్ధులైన జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన రాసిన కీచక వధ నాటిక మీకోసం. ఈ నాటిక  విశ్వనాధ వారి నర్తనశాల కు జరుక్ మార్కు పేరడీ గా భావిస్తారు. జరుక్ శాస్త్రి పేరడీల మీద సూరంపూడి సుధ గారు రాసిన విమర్శనాత్మక పరిశోధన గ్రంధం నుండి ఈ నాటికను తీసుకోవడం జరిగింది. 


కీచక వధ 
(నాటిక)

(ప్రవేశం: కీచకుడు. సుమారు 30 ఏళ్ళు ఉంటాయి. ఫ్రెంచ్ కట్ మీసం, బెంగాలీ క్రాఫ్)

నా పేరు సింహబలుడు. నేను విరాటరాజు గారి పెద్ద బావమరిదిని. నేను మెత్తగా ఉన్నంత సేపూ లక్కల్లే ఉంటాగానీ - బిగించేసానంటేనా - హే( యమ నిక్కు నిక్కుతా! ఏమిటో అల్లాటప్పా కింద కట్టేస్తున్నట్లుంది లోకం...ఉల్లిపాయల పులుసు అంటే నాకు - ఎంత ఇష్టమో .....?

(ద్రౌపది ఇంతట్లో ప్రవేశించి ఆరు నెలలనాడు పోయిన  'ఉత్తర' పాత చెడావుల్ని వెతుకుతూ అక్కడే తచ్చాడుతూంటుంది. వయసు 26. కష్టాలనుభవించిన మొహం)

 సింహబలుడు: (తనలో) ఈ అమ్మాయినే కదూ - కాముకి - అని అన్నాడు మా వూరి అబ్బాయి. (పైకి) తమరేనా మా అక్క అంతఃపురంలో ఇటీవల ఉన్నది. 

ద్రౌపది: అవును 

సింహ: నా పేరు సింహబలుడు. నేను విరాటరాజు గారి పెద్ద బావను.

ద్రౌపది: చిత్తం తమరు పండితులని విన్నాను

సింహ: నాకు పెద్ద బాల శిక్ష బాఘా వొచ్చును

ద్రౌపది: చిత్తం 

సింహ : (తనలో) ఈ అమ్మాయి బాగా ఉల్లిపాయలు తింటుందల్లే ఉంది. అమ్మో ఎంత "శృంగార రస పట్టభద్ర'యో? (పైకి) మీ పేరు? 

ద్రౌపది: సైరంధ్రి అంటారు

సింహ: మీరు ప్రబంధ యుగంలోంచి ఇలా చక్కా..వచ్చారా (తనలో - భలే బాగుంది)

ద్రౌపది: ఓ నాటకం కూడా దాటి వచ్చాను

సింహ: (తనలో) పాపం - ప్రబంధం అంటే ఎరగదల్లే ఉంది. (పైకి) ప్రబంధం అంటే ఎరగరా మీరు? కవి చౌడప్ప శతకం లేదూ...అట్టివి ప్రబంధాలంటే - మీకు సంగీతం బాగా వచ్చనుకుంటా?

ద్రౌపది: (తనలో) ఛీ - వీడొక త్రాష్టుడు

సింహ: ఇప్పుడు పాడమంటాననా ఆలోచిస్తున్నారు? అబ్బే ఎల్లుండి మా ఇంట్లో కచ్చేరీ పెట్టిద్దామని.

ద్రౌపది : (తనలో) వీణ్ణి ఎలాగన్నా మన్ను చేయాలి

సింహ: మిమ్మల్నీ ఇటీవల ..."అయిదుగురు భర్తలట ఎంత కాముకి?" అన్నార్ట ఎవరో?

ద్రౌపది: (మౌనం) 

సింహ: సరేలెండి మా అక్కగారు ఇంట్లో ఉన్నారా?

ద్రౌపది: ఉన్నారనుకుంటా 

(ఇద్దరూ వెళ్ళిపోతారు)


రెండో రంగం

(సుధేష్ణ టీ త్రాగుతూంటుంది. సాయంకాలం నాలుగు గంటల ప్రాంతం. ఉత్తర అప్పుడే వచ్చి టీకి కబురు చేసి సిగరట్టు ముట్టిస్తుంది. సింహబలుడు కొంచెం అవతల గడ్డం చేసుకుంటూ ఉంటాడు. ద్రౌపది ఉత్తరకు కూడా టీ తెచ్చి టీపాయి మీద పెట్టి పోతుంది).

సింహ: అక్కయ్యా ఈ అమ్మాయి ఎవరూ?

సుధేష్ణ: ఎవరో నాకు తెలియదు, ఓ ఏడాది మా ఇంట్లో ఉంటానంటే ఉండమన్నాను.

ఉత్తర: సంగీతం బాగా వచ్చనుకుంటా మామయ్యా! మా బృహన్నల గారు చెప్పారు. 

సుధేష్ణ : అలా అనకూడదు పరాయివాళ్ళని

సింహ: అక్కయ్యా ఆ అమ్మాయిని చూస్తే రకం వారీగానే ఉన్నది

సుధేష్ణ: అప్పుడే నీ కన్నుబడ్డదీ  - ఇక బాగుపడవు

సింహ: అదికాదు అక్కయా - మొన్న మన ఊళ్ళో ఎవరో అన్నారు. 5 గురు భర్తలట ఎంత కాముకి" అని

సుధేష్ణ: అంతా ఉత్తది

సింహ: అవునుగానీ - చెబితే నమ్ముతావో నమ్మవో అక్కయ్యా ఆ అమ్మాయి నా కోసం ఎదురు రొమ్ము కొట్టుకుంటుంది

సుధేష్ణ: ఛీ తప్పు - అల్లా అనకూడదు 

సింహ: అల్లాక్కాదక్కయ్యా - ఆవిడ కళ్ళు చూశావూ?  ఏమోకానీ అక్కయ్యా నాకు మటుక్కు ఆవిడంటే సుగంధంతో కూడుకున్న టీవలె ఉంటుంది

సుధేష్ణ: ఇటువంటి మాటలు చెప్పకు

ఉత్తర: మామయ్య రసోన్మత్తుడు

సింహ: అక్కా చనువు కనక నీతో చెబుతున్నాను ఆ అమ్మాయిని ఈ రాత్రి మా ఇంటికి పంపకపోతే ఈ కత్తి పెట్టుకుని పీక కోసుకుంటాను - నిజం 

సుధేష్ణ: అఘాయిత్యం మాటలు చెప్పకు 

సింహ: నిజం అక్కయ్యా నిజం ముమ్మాటికీ నిజం 

సుధేష్ణ: నీకు సుధేష్ణ వంటిది. తప్పు. అలా అనకూడదు 

సింహ: అక్కా నీకేమన్నా పిచ్చా వెర్రి పోలికలు తెస్తావేంటి. నా మాటలు ఒప్పుకోకపోతే ఇప్పుడు నీ కళ్ళ ఎదుటే ఇప్పుడే కోసుకుంటాను - ఇదిగో 

సుధేష్ణ: ఏమిట్రా గందరగోళం 

ఉత్తర: మామయ్యా సిగరెట్టు కావాలా? 

(సింహబలుడు గడ్డం గీసుకోవడం పూర్తి అవుతుంది. ముఖం కడుక్కుని వస్తాడు, ఉత్తర సిగరెట్టు ఇస్తుంది. సింహబలుడు అంటిస్తాడు)

సింహ : అక్కా నా వొళ్ళు పట్టుకుచూడు...ఎట్లా ఉందో - శీతల పైత్య జ్వరం లాగు !

సుధేష్ణ : అప్రతిష్ట ....అప్రతిష్ట 

సింహ: ఉత్తరా టీ తీసుకురమ్మను

(ఉత్తర వెళ్లిపోబోతుంటే - కీచకుడు ఆమెకు కన్ను కొడతాడు. ఆమె మొహం చిట్లించుకు వెళ్ళిపోతుంది)

సింహ : (టీ త్రాగుతూ) అక్కయ్యా రాత్రి పది దాటింతరువాత టీ కాచమను. టీ డస్ట్ తీసి దాచెయ్యి. ఆ వెనక టీ డస్ట్ కోసం సైరంద్రిని మా ఇంటికి పంపు ...లేకపోతే బ్రతకను

సుధేష్ణ : జలగలా పట్టుకున్నావేమిటిరా? అల్లాగేలే వెళ్ళు

సింహ: అల్లాగేలే అంటే కాదు. ఎదురు చూస్తూ ఉంటాను.

సుధేష్ణ: సరేలే

సింహ: అక్కయ్యా అన్నమాట తప్పకూడదు 

సుధేష్ణ: నాకు అప్రతిష్ట తీసుకురాకు 

సింహ: చెప్పిపెట్టే బుద్ధి ఎంతసేపూ (అంతా వెళ్ళిపోతారు)

(వర్షం కురుస్తుంది ఆ వర్షం అల్లా - ఇల్లా - భేషుగ్గా - సొగసుగా ఉన్నది)


మూడో రంగం


(రాత్రి పదిగంటల తరువాత)

(ద్రౌపది వెళ్ళలేక గజగమనంతో వెళ్ళుతూంటుంది. కీచకుడు ఏమీ తోచక వరండాలో అటూ ఇటూ పచార్లు చేస్తూంటాడు. వాకిట్లో పారావాళ్ళు ఉండరు. దూరం నుంచి ద్రౌపదిని చూసి ఇంట్లోకి పారిపోయి పెద్ద బాలశిక్షా, కవిచౌడప్ప శతకం తీసుకుని చదువుతూంటాడు)

ద్రౌపది : (ప్రవేశించి) సింహబల మహారాజా

సింహ: ......

ద్రౌపది: కీచక మహారాజా

సింహ: ఎవరు వారు?

ద్రౌపది: నేనండీ సైరంధ్రిని. సుధేష్ణ పంపితే వచ్చాను.

సింహ: ఓహో మీరా..దయచేయండి. లోపల చదువుకుంటున్నాను

ద్రౌపది:: తమరిప్పుడు పఠించే గ్రంధమేమిటండీ?

సింహ: పెద్ద బాలశిక్ష 

ద్రౌపది: అల్లాగండీ

సింహ: మా అక్క మిమ్మల్ని పంపిందా?

ద్రౌపది: అవును టీ డస్ట్ కోసం 

సింహ: 'రావే నీ కవుగిట నన్నదుమవే'

ద్రౌపది: తమరు టీ సేవించారా?

సింహ: నీకు కావలెనా? ఓ లక్ష కప్పులు ఇప్పిస్తాను

ద్రౌపది: నాకక్కర్లేదు. తమరు కులాసాగా పాడుకుంటుంటే తాగారేమో అనుకున్నాను 

సింహ: పోనీ నువ్వు కూడా తాగరాదూ

ద్రౌపది: అక్కర్లేదండీ

సింహ: మీరు కూడా తాగి నన్ను ధన్యుడ్ని చేయరాదూ? ఇదిగో ప్రేమదాసుడు 

ద్రౌపది: టీ డస్ట్ ఇప్పించండి - మీ అక్కగారు టీ కోసం బాధపడుతూంటారు

సింహ: (వెకిలి నవ్వు నవ్వి) మరేమీ అక్కకు బాధుండదు లెండి 

ద్రౌపది: కాదు తలనొప్పిగా ఉందామెకు  

సింహ: అదంతా ఒట్టిది - నాకోసమే మిమ్మల్ని పంపారు (అని ముందుకొస్తాడు)

ద్రౌపది : (వైతొలగి) దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక...

సింహ: ఆగూ. నాకూ వచ్చు ఆ పద్యం - పరవాలా "నీ చనుకొండల గ్రుమ్మి"

ద్రౌపది: (ఇరిటేటై) నలిపి వేయాలా?

సింహ: ఆ( అదీ 

ద్రౌపది: ఇంతకీ టీ డస్ట్ ఇస్తారా ఇయ్యరా?

సింహ: నీ కాలిమీద పడతా. కౌగిలి ఇయ్యవూ?

ద్రౌపది: హల్లాగా

సింహ: మరి నా వొళ్ళు పనసకాయల్లే గరి పొడవద్దూ? (దగ్గరకొస్తాడు)

ద్రౌపది: ఠట్..ఆగు 

సింహ : (అదిరిపడి క్రాఫ్ ఎగరేస్తాడు)

ద్రౌపది: నేను వెళ్లిపోవచ్చా

సింహ: అప్పుడే

ద్రౌపది: మరి నేను వచ్చిన పని అయిందిగా 

సింహ: నాకు ప్రేమభిక్ష పెట్టవూ?

ద్రౌపది: నాకోసం నువ్వు ఏం త్యాగం చేస్తావ్?

సింహ: నా ప్రాణాలు అయిదూ అర్పిస్తా

ద్రౌపది: (ప్రక్కనున్న ఇనుప గుదియబండ అతనికి తెలియకుండా పట్టుకుని ) అయితే ఇల్లారా

సింహ: (వొస్తాడు)

ద్రౌపది: అల్లాపో 

సింహ: (పోతాడు)

ద్రౌపది: ఇల్లా వచ్చి అటు మొహం పెట్టి కూర్చో

సింహ:(అల్లాగే కూర్చుంటాడు)

ద్రౌపది: (వెనుకపాటున ఠపీమని గుదియ పెట్టి వాడి నెత్తిన కొడుతుంది. సింహ బలుడికి వొళ్ళంతా నెత్తురుమయం)

(ఇవతలకు వచ్చి) ఇవాళతో అజ్ఞాతవాసం సంపూర్తి. ఇకముందు చూసే రక్తప్రవాహానికి ఇది మొదటి అనుభవం. త్రాష్టుడు. వెళ్లి ఈ వార్త భీముడితో చెప్తా. 

(తెర) 


జరుక్ శాస్త్రి గారికి నా నివాళి ఇక్కడ చూడండి : ఝలక్ - జరుక్

Tuesday, July 12, 2011

ముక్కోతి కొమ్మచ్చి - అప్పుతచ్చులు .....ప్రింటర్ కి బుడుగ్గాడు ప్రైవేటు చెప్పేయటం ఖాయం


ఈ రోజు రమణ గారి ముక్కోతి కొమ్మచ్చి విడుదలైంది. ఆత్రంగా వెళ్లి తెచ్చుకుని రెండు మూడు గంటలు దాన్ని తనివితీరా చూసుకుని చదువుదామని తెరిచానో లేదో చిన్న ఝలక్.

రమణ గారే వెళ్ళిపోయి తొందరపడ్డారని బాధపడుతుంటే ముక్కోతి కొమ్మచ్చి ప్రింటర్ ఆయనకన్నా తొందరపడ్డాడు. పదహారో పేజీ తర్వాత ముప్పై రెండో పేజీ వరకు చివరాఖరి పేజీలు (117-131)  పెట్టేసి అనంతమైన రమణ గారి కబుర్లని ఆదిలోనే అంతానికి చేర్చేసాడు. మళ్ళీ పదహారు పేజీల తర్వాత నాలుక్కరుచుకుని  ముప్ఫై మూడో పేజీ నుంచీ చివరి పేజీ (131) వరకు వరసలో ఉంచాడు. అంటే ఈ సినిమాలో క్లైమాక్స్ పదహారో రీల్లోనే ఒక సారి చూపించేస్తాడన్నమాట. ఏదో ఒక పుస్తకం లో అంటే అనుకోచ్చు. మూడు పుస్తకాలు కొన్నా. మూడిటి కథా అంతే. ఈ తప్పు పబ్లిషర్స్ త్వరలోనే సవరించుకుంటారని ఆశిస్తున్నా. (అప్పుడు మళ్ళీ ఇంకో మూడు కొంటా. మొత్తం మూడు జతల సెట్లన్న మాట :)))) )

మరి పదిహేడు నుంచీ ముప్ఫై రెండో పేజీ వరకూనో అంటారా? .......అవి లేవనే కదా ఈ పోస్ట్ పెట్టింది. ఆ పేజీల్లో ఏముందో పబ్లిషర్లె చెప్పాలి. :)

Tuesday, May 31, 2011

విశ్వనాధ వారి మరో హాస్య నవల - హా హా హు హు


నిజంగా ఈ నవల చదివి ఆయన కల్పనా శక్తికి జోహార్లర్పించాను. ఏం క్రియేటివిటీ!!!! అబ్బో సూపరో సూపరు. నెట్లో దొరికిన ఈ నవల మీతో పంచుకుందామని పోస్ట్ చేస్తున్నా.మధ్యలో అక్కడక్కడ ఒకటి రెండు పేజీలు  మిస్సయింది. అయితే  కధ ఫ్లో కి అది అడ్డురాదు.  మరింకెందుకు ఆలశ్యం? ఎంజాయ్. 
పాస్ వర్డ్ అంటారా? చెప్పకపోతే మీరు ఊరుకుంటారా? ఇదిగో  mallepoolu.com


Friday, March 25, 2011

విశ్వనాధ వారి వీర కామెడీ : "విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు" - మీరూ చదివేయండి


విశ్వనాధ సత్యనారాయణ - ఈ పేరు వింటే ఒక ఏకవీర, ఒక వేయిపడగలు, ఒక రామాయణ కల్ప వృక్షం గుర్తొస్తాయి. అబ్బే ఈయన అదో టైపు. బాష కుసింత భారీగా ఉంటుంది. ఒక ముళ్ళపూడి వెంకటరమణ, రావిశాస్త్రిల్లా అందరికీ అర్ధమయ్యేలా రాయక కాస్త గ్రాంధికం పాళ్ళు ఎక్కువేసి కన్నీళ్లు, సెంటిమెంటు వగైరా సీరియస్ రసాలే తప్ప కామెడీ రాయడు అనుకునే వారికి ఈ పుస్తకం చదివితే ఆయనలో ఇంకో కోణం కనిపిస్తుంది. ఈ పుస్తకం చదువుతుంటే నాకు బోల్డన్ని పంచ్ డైలాగులు కనిపించి వార్నీ ఈయనలో ఇంత హాస్య చతురత ఉందా అనిపించింది. ఈ ఒక్కటే కాదు హా హా హు హు అని ఈయన రాసిన ఇంకో కామెడీ నవల (దాన్ని నవల అనేకన్నా పెద్ద కధ అనడం సబబేమో) చదివాక ఆయన ఊహాశక్తికి ఆశ్చర్యమేసింది. తరవాత పోస్ట్ లో అది కూడా ఇస్తా లెండి. ప్రస్తుతానికి మాత్రం ఇది చదివి మనసారా నవ్వుకోండి. వ్యంగ్య హాస్యం ఇందులో పుష్కలంగా ఉంది. లింక్ కింద ఇస్తున్నా.

Sunday, February 27, 2011

రమణ గారు గిరీశం తో చెప్పించిన లెక్చర్లు - ఓ సారి చదివేద్దురూ. లేకపోతే రమణగారు ఊర్కున్నా గిరీశం అసలు ఊర్కోడు

గిరీశం లెక్చర్లు - ఏమైనా చెప్పాలా ఈ పుస్తకం గురించి? అహ చెప్పాలా..అని అడుగుతున్నాను. రమణ గారి కలం లోని పదును, వ్యంగ్యం, మనసుకి కితకితలు పెట్టే హాస్యం, అక్కడక్కడ మనకి ఎక్కడో చురుక్కుమనేలా తన మార్కు సెటైర్లు మొత్తం మీద వేడి వేడి పకోడీల ప్లేటులా ఉంటుంది ఈ పుస్తకం. 

మల్లెపూలు.కాం సైట్ లో ఎప్పుడెప్పుడో దొరికిన ఈ పుస్తకాన్ని మీ చేతా చదివిన్చేద్దామని డిసైడయిపోయా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఈ  ఈ-బుక్ ఒక పాస్ వర్డ్ ఉంది. అదేంటో చెప్పాలంటే మీరు నాకు పన్నెండు, పదమూడు, పద్నాల్గు, పదిహేను చేగోడీలు ఇవ్వాలన్నమాట. ఇదిగో ఆ పుస్తకం లింక్ 


ఏంటి క్లిక్ చేసేసారా? మీకూ కుసింత కంగారేక్కువే. సర్లెండి ఎంతయినా మీరు నా ఫ్రెండులు కాబట్టి ఆ పాస్ వర్డ్ రహస్యం మీకు చెప్పేస్తా. చేగోడీలు పొట్లం కట్టించి తీరిగ్గా పంపిద్దురుగాని. 
పాస్ వర్డ్ : mallepoolu.com


అన్నట్టు మర్చిపోయా నా ఇంకో బ్లాగ్ లో (అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!) రమణ గారికి శతోపమాన నివాళి అందించా. ఒక సారి చూసి తిట్లు, చీవాట్లు, బిస్కత్తులు, చాక్లేత్తులు ఇచ్చేయండి.


Friday, February 25, 2011

జాటర్ ఢమాల్ ......వీడే బుడుగు...చిచ్చుల పిడుగు

ఇది నా బ్లాగు లో పరిచయం తరువాత మొదటి పోస్ట్. పరిచయం లో చెప్పినట్టుగానే ఈ బ్లాగ్ లో మొదటి పోస్ట్ గా ముళ్ళపూడి వెంకట రమణ గారి "బుడుగు"  ఈ బుక్ మీకు అందిస్తున్నాను. నిజానికి ఇది నా ఇంకో బ్లాగు "అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే !!!!!!" లో గత ఫిబ్రవరిలో పోస్ట్ చేసి రమణ గారిని కలిసినప్పుడు ఆయనకి చూపించా. ఈ ఫిబ్రవరిలో మళ్ళీ దీనిని ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు. ఆయనకి నివాళులర్పిస్తూ ఈ ఈ- పుస్తకం మీ కోసం.

బుడుగు గురించి మీకు పరిచయం చెయ్యడం అంటే ఆవకాయ గురించి తెలుగోడికి పరిచయం చేసినట్టే కాబట్టి నాకు బాపుబొమ్మ.కాం లో దొరికిన ఆ  బుడుగు  ఈ- బుక్ ని మీకు లింకుగా ఇస్తున్నా. ఆల్రెడీ చదివేశాం అంటారా. మళ్ళీ చదవండి...ఏం.. మాయా బజార్ మళ్ళీ వస్తే చూడట్లేదూ...ఇదీ అంతే!


(పోస్టు బావుందని చచ్చినట్టు ఒప్పుకోకపోతే మీ పని  జాటర్ ఢమాలే! అని బుడుగు చెప్పమన్నాడు )