Thursday, February 23, 2012

ఎవడ్రా సెప్పింది రవణ లేడని?


 ఇదిగో సెగట్రీ ఎవడయ్యా ఈ రవణ?? ఈ రోజు తన మొదటి వర్ధంతి అని జనాలు ఓ నివాళులు అర్పించేస్తున్నారు?

ఆయ్! ఆయనో గొప్ప తెలుగు సాహితీవేత్తండి

సాహితీ వేత్తా???చాలా పెద్ద పదం వాడేశావేమో?

అబ్బే లేదండి. కరెస్టుగానే చెప్పా

అవునూ రవణ అంటే ఆ బొమ్మలేసుకునే బాపుతో పాటు వినిపించే పేరేనా? ఆళ్లిద్దరూ మంచి ఫ్రెండ్సు అని విన్నా

ఆయ్ ఆయనేనండి. అయినా ఆళ్ళు ఇద్దరు కాదండి. ఒక్కరే

ఆయనేదో కామెడీ రాతలు రాస్తాడు కదయ్యా. సాహితీవేత్త అదీ..ఇదీ అని తెగపొగిడేస్తావేంటి?

ఆయ్ మన తెలుగోళ్ళతో వచ్చిన చిక్కే అదండయ్యా. ఎవరికైనా ఒక్క ఇమేజ్ ఇచ్చారంటే ఇహ దానికే కట్టి పారేస్తారు

సరే లెద్దూ..ఇంతకీ ఈయనేం చేశాట్ట సాహిత్యానికి?, తెలుగోళ్ళకి? శ్రీశ్రీ లా సమాజాన్ని తట్టి లేపాడా? విశ్వనాధలా తెలుగు సాహిత్యాన్ని జ్ఞానపీఠం ఎక్కించాడా?

ఆళ్ళు సేయలేని పని ఈయన చేశాడండి

ఏంటో?

మనందరి బాల్యాన్ని బుడుగు పేరుతో శాశ్వతం చేసి పారేశాడు. అదొక్కటి చాలు కదండయ్యా

అంటే పిల్లకాయల కతలు రాశాడా?

లేదండి బుడుగుని మనకిచ్చి మన బాల్యాన్ని ఎప్పుడూ మనతో పాటే భద్రంగా ఉంచుకునేలా చేశాడండి. బుడుగుని చూస్తే మన చిన్నప్పటి రోజుల్ని అద్దంలో చూసుకున్నట్టేనండి మరి ఆయ్(!

సరే గానీ ఇంకేవయినా రాశాడా? కామెడీ కతల గురించి సెప్పమాక అయి నేనూ ఇన్నా.

ఒక్కటని ఎలా సెప్తామండీ మధ్యతరగతి జీవితాలలో ఉప్పూ, కారం, పులుపు వగైరాల్ని నొప్పి తెలియకుండా, కష్టాల్ని కూడా కామెడీ పూతతో తెలుగోడికి రుచ్చూపించాడండి.

కామెడీతో కూడా కన్నీళ్లు పెట్టించచ్చు అని చెప్పాడంటావ్! అంతేనా?

ఆయ్! అలాక్కూడా అనుకోవచ్చండయ్యా

అద్సరే కానీ యమ సీరియస్సు మేటర్లు ఎవన్నా గీకాడా?

భలేవారే గిరీశంతో లెక్చర్లిప్పించి ఎకేస్తేనూ!

బావుందయ్యోయ్ అయితే మనోడికి సామాజిక స్పృహ కూడా ఉందన్నమాట

ఆయ్(. అన్నట్టు మర్చిపోయానండోయ్. ఈయన గారు మొత్తం కృష్ణ తత్వాన్ని ఒక్క కతలో ఇమిడ్చేశాడు

ఊర్కోవయ్యా నువ్వు మరీనూ. అతిశయోక్తి కి కూడా ఓ హద్దుండాల. కృష్ణతత్త్వం చెప్పడానికి పురాణాలే సరిపోలేదు. కతలో ఇరికిన్చేయడం ఏంటి? కామెడీ కాకపోతే, అదీ ఈయన?

ఆయ్ (..నిజవేనండి బాబూ. కానుక అని ఓ కత రాశాడు. ఈయన మిగిలిన రచనలు ఒకెత్తు. అదొహ్హటీ ఒకెత్తు.

తులాభారంలో కృష్ణుడు, తులసాకులా అన్న మాట

మరే! బాగా చెప్పారు

సూడబోతే తెలుగోళ్ళకి చాలానే సేసినట్టు ఉన్నాడయ్యోయ్

అయ్( అదే కదండీ నేను చెప్తూంటా. బుడుగునిచ్చి మన బాల్యాన్ని; అప్పారావునిచ్చి మధ్య తరగతి రుణానుబంధాల్ని; రాధని, గోపాళాన్ని ఇచ్చి మొగుడూపెళ్ళాల ముద్దుముచ్చట్లని ఇలా ఒక్కటేంటి తెలుగు జాతి మొత్తాన్ని జనతా ఎక్స్ప్రెస్ లో ఎక్కించి తిప్పాడు కదండయ్యా. అన్నట్టు మిమ్మల్ని, నన్నూ కూడా పుట్టించింది ఆయనే నండోయ్!!!

సూడబోతే మా గొప్పోడయ్యా ఈ రవణ. మరి అంత గొప్పోడు ఇలా అర్ధాంతరంగా తన ఫ్రెండుని వదిలి వెళ్లిపోవడం ఏం న్యాయమయ్యా? పాపం ఆ బాపుని తల్చుకుంటే జాలేస్తోంది

జాలెందుకండయ్యా? రవణ గారు పోయారని ఎవరు చెప్పారు మీకు?

అదేంటీ అంతా నివాళులు గట్రా అర్పించేస్తూంటేనూ.....

రవణగోరికి మరణం లేదండయ్యా. బాపులో ఉంటాడు, బుడుగులో ఉంటాడు, అప్పారావులో ఉంటాడు, మీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ప్రతి తెలుగోడి గుండెలో ఉంటాడు, ఉన్నాడు

19 comments:

డా.ఆచార్య ఫణీంద్ర said...

చాల బాగుందండి. అభినందన!

Unknown said...

ప్రతి తెలుగోడి గుండెలో చిరకాలం ఉంటారు...ఎన్ని తరాలకైనా చెదరక...
అప్పుడే యేడాది గడచిపోయిందా అనిపిస్తుంది...

DARPANAM said...

భలేగు౦ద౦డీ రాత ..తెలుగంత తీఎగా ....ఆయ్

పరుచూరి వంశీ కృష్ణ . said...

బావుందండీ ! బాగా రాసారు

శేఖర్ (Sekhar) said...

చాల బాగా రాసారండి :)

రాజ్ కుమార్ said...

రవణగోరికి మరణం లేదండయ్యా. బాపులో ఉంటాడు, బుడుగులో ఉంటాడు, అప్పారావులో ఉంటాడు, మీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ప్రతి తెలుగోడి గుండెలో ఉంటాడు, ఉన్నాడు... హ్మ్మ్...

సూపర్ గా రాశారు సారు..

Unknown said...

“రవణగోరికి మరణం లేదండయ్యా. బాపులో ఉంటాడు, బుడుగులో ఉంటాడు, అప్పారావులో ఉంటాడు, మీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ప్రతి తెలుగోడి గుండెలో ఉంటాడు, ఉన్నాడు”

నిజం చెప్పారు. పోస్ట్ చాలా బావుంది.

Chandu S said...

ఎంతో బాగుంది శంకర్ గారూ.

తృష్ణ said...

very true !!

phaneendra said...

ప్రతి తెలుగోడి గుండెలో ఉంటాడు, ఉన్నాడు -- నిఝంగా నిఝం

ranjith said...

ramana untaru telugu unnata kalam.....telugu vallam anukune valla gundello.........

శ్రీనివాస్ పప్పు said...

సూపరెహే అద్దిరింది

ఆ.సౌమ్య said...

చాలా బాగా చెప్పారు శంకర్ గారూ....ఆయనకి మరణమేమిటి! తెలుగువారి మనసుల్లో చిరంజీవి ఆయన.

సుభ/subha said...

Really Nice sir..

సిరిసిరిమువ్వ said...

“రవణగోరికి మరణం లేదండయ్యా. బాపులో ఉంటాడు, బుడుగులో ఉంటాడు, అప్పారావులో ఉంటాడు, మీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ప్రతి తెలుగోడి గుండెలో ఉంటాడు, ఉన్నాడు”..నిజంగా నిజం. బాగా వ్రాసారు!

పద్మవల్లి said...

చాలా బాగా చెప్పారు శంకర్ గారూ.

Jagannadharaju said...

ఒరేయ్ నువ్వేనా రాసింది ?
బోలెడన్ని అనుమానాలు - ఓ సారి లోపలంతా కేలికినట్టు అయిందిరా.,
ఇంకో సారి ఇలాంటివి రాసావంటే అయిపోతావు, తత్కాల్ టిక్కెట్టు కొనుక్కుని మరీ వచ్చి తంతా...

మనసు పలికే said...

టపా చదవడం ఆలస్యం అయినందుకు బాధగా ఉంది:(
టపా అద్భుతం అంతే, చాలా బాగా రాశారు :))

A Homemaker's Utopia said...

చాలా మంచి టపా రాశారు శంకర్ గారూ.. ఆలస్యం గా చదివినా మంచి ఆర్టికల్ మిస్ కానందుకు సంతోషం గా ఉంది..:-)

Post a Comment